ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు సూచనలు చేశారు.
జిల్లాలో చేపట్టిన స్కూల్ కాంపౌండ్ వాల్స్, పాఠశాలల మరుగుదొడ్లు, జీపీ బిల్డింగ్స్, మహిళా సంఘ భవనాల నిర్మాణ పనులు నిర్దేశిత కాలపట్టికలో పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు. ప్రతి పనిని నాణ్యతతో చేపట్టి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని ఆమె సూచించారు.
జిల్లాలో కొనసాగుతున్న పనుల ప్రగతి సంతృప్తికరంగా లేని చోట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని, పనుల్లో ఆలస్యం జరగకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో కాంపౌండ్ వాల్లు, టాయిలెట్స్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు భద్రతా వాతావరణం కల్పించాలని ఆమె ఆదేశించారు.
మహిళా సంఘ భవనాల నిర్మాణం ద్వారా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు మరింత బలోపేతం అవుతాయని, ఈ పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామ స్థాయిలో పర్యవేక్షణ పెంచి, పనుల నాణ్యతను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
డిఆర్డిఏ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలు సమన్వయంతో పనిచేసి పనులను సమయానికి పూర్తి చేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలిత కుమారి, డీఈఓ వెంకటేశ్వర్లు, పీడీ డిఆర్డిఏ జ్యోతి, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












