రాష్ట్ర బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై మహిళా జర్నలిస్టుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం జర్నలిస్టులను నిర్లక్ష్యం చేస్తోందని సంఘం అధ్యక్షురాలు బైస సంగీత ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమానికి, సమాచార శాఖకు, మీడియా అకాడమీకి ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై మహిళా జర్నలిస్టుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షురాలు బైస సంగీత మాట్లాడుతూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే మీడియా రంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం నాడు చేసిన వ్యాఖ్యలు కేవలం ఆర్భాటమేనని, జర్నలిస్టుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఈ బడ్జెట్ కేటాయింపులు నిరూపిస్తున్నాయని సంగీత అన్నారు. ఇళ్ల స్థలాల వంటి సంక్షేమ పథకాలపైనా స్పష్టత లేకపోవడం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మీడియా పట్ల నిర్లక్ష్యం చూపడం సరికాదని, జర్నలిస్టులకు కనీసం అక్రిడిటేషన్లు కూడా మంజూరు చేయలేదని, రెండేళ్లుగా అక్రిడిటేషన్ గడువును పొడిగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ హెల్త్ కార్డుల విషయంలోనూ ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు.
బడ్జెట్లో నిధుల కేటాయింపు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించిన సంగీత, ప్రభుత్వానికి జర్నలిస్టుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. ఈ వైఖరిని ఖండిస్తున్నామని, ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడాలని డిమాండ్ చేశారు.











