రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బరాఖత్ గూడెం లో వినూత్న నిరసన తెలిపారు.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెం లో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ నేతృత్వంలో వికలాంగులు తమ నిరసనను తెలియజేస్తూ బట్టలు చింపుకొని, బలుసు ఆకులు తింటూ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా గిద్దె రాజేష్ మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 'అభయహస్తం' మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రూ. 6,000 పెన్షన్, ఆర్టీసీ బస్సుల్లో 100% రాయితీతో ఉచిత ప్రయాణం, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
ప్రస్తుత బడ్జెట్లో పైసా కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తన బడ్జెట్ను వెంటనే సవరించి, వికలాంగుల సంక్షేమానికి రూ. 3,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.











