జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం తాడ్వాయి మండలం ఏండ్రియాల్ గ్రామాన్ని సందర్శించి, గ్రామాల్లో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో అందుబాటులో ఉన్న తాగునీటి వనరులు, మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.
గ్రామంలోని మంచి నీటి వనరులను పరిశీలించినప్పుడు, 3 మంచి నీటి ట్యాంకులు, 4 బోరు బావులు, పంప్ సెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. గ్రామంలో మొత్తం 396 ఇళ్లకు ఇంటింటి నల్లా కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు.
మిషన్ భగీరథ పథకం కింద ప్రతిరోజూ తాగునీటి సరఫరా ఎలా జరుగుతోందని కలెక్టర్ సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.
ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. నీటి వనరుల నిర్వహణ, సరఫరా వ్యవస్థపై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.












