తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారం, రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో రెవెన్యూ శాఖ కీలక అడుగు వేసింది. ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను నేటి నుంచి ఐదు మండలాల్లో ప్రయోగత్మకంగా అమలు చేయనుంది.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్ పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ఈ పోర్టల్ ను మొదటగా అమలు చేయనున్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ పోర్టల్ ముఖ్య ఉద్దేశ్యమని మంత్రి పేర్కొన్నారు.
ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని తీర్చిదిద్దారు. సామాన్య రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కేరళ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి, పోర్టల్ ప్రారంభానికి ముందు రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు చేశారు. ఈ పోర్టల్ నిర్వహణపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. భవిష్యత్తులో ఈ పోర్టల్ ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలున్నాయి.
గతంలో మాదిరిగా రైతులు తమ భూ సంబంధిత సేవల కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఇక ఉండదని, ఇంటి నుంచే ఆన్లైన్ లో సేవలు పొందే విధంగా పోర్టల్ ను రూపొందించినట్లు మంత్రి వివరించారు. ఈ సంస్కరణలు భూ వివాదాల పరిష్కారానికి ఒక ముఖ్యమైన తొలి అడుగుగా పరిగణించబడుతున్నాయి.











