తెలంగాణ సచివాలయంలో కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామిని దక్షిణ కొరియా బౌద్ధ కౌన్సిల్ ప్రతినిధి బృందం గురువారం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. రాష్ట్రంలో బౌద్ధ విలువలు, గౌతమ బుద్ధుని బోధనలను విస్తరించడంలో మంత్రి అందిస్తున్న మద్దతుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
దక్షిణ కొరియా బౌద్ధ కౌన్సిల్ ప్రతినిధులు మంత్రి వివేక్ వెంకటస్వామిని ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో బౌద్ధమత వ్యాప్తికి, గౌతమ బుద్ధుని బోధనలను ప్రోత్సహించడంలో మంత్రి చేస్తున్న కృషిని వారు అభినందించారు.
ఇటీవల కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతంగా నిర్వహించిన ‘ధమ్మ యాత్ర’కు మంత్రి అందించిన ప్రోత్సాహానికి ప్రతినిధులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యాత్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను సంతరించుకుందని వారు పేర్కొన్నారు.
కలబుర్గిలో ప్రారంభమై నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో ముగిసిన ధమ్మ యాత్ర, బౌద్ధ సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిందని ప్రతినిధులు తెలిపారు.
ప్రముఖ నటుడు గగన్ మాలిక్ నేతృత్వంలో వచ్చిన ఈ బృందంలో ఇంటర్నేషనల్ ఇంటర్చేంజ్ డెవలప్మెంట్ అసోసియేషన్ (IIDA) అధ్యక్షుడు యోంగ్జో మున్, జనరల్ మేనేజర్ గ్యుహ్వా కాంగ్, ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ సుజియాంగ్ మున్, కాస్మెటిక్స్ సీఈఓ కియుం మీ హాన్, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ మి క్యుంగ్ పార్క్, సెక్రటరీ వోన్ సియోప్ కిమ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.











