రాష్ట్ర ప్రభుత్వ తాజా బడ్జెట్లో జర్నలిస్టులకు సంబంధించిన అంశాలు పూర్తిగా పక్కన పెట్టడంపై తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (టీజేయూ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బడ్జెట్లో సమాచార శాఖ, మీడియా అకాడమీ, జర్నలిస్టుల సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రస్తావన లేకపోవడం విచారకరమని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి విమర్శించారు.
జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా పథకాలు ఎలా అమలు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఇండ్ల స్థలాలు, అక్క్రిడిటేషన్ కార్డులు, డిజిటల్ హెల్త్ కార్డుల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.
రెండు సంవత్సరాలుగా అక్క్రిడిటేషన్ గడువును పొడిగిస్తూ వస్తున్న ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తున్న మీడియా పట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని టీజేయూ అభిప్రాయపడింది.
మహిళా జర్నలిస్టుల సమస్యలు, ఉత్తమ జర్నలిస్టు అవార్డుల ప్రస్తావన కూడా బడ్జెట్లో లేకపోవడం అసంతృప్తిని మరింత పెంచిందని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాల కేటాయింపుపై ఇచ్చిన హామీలను కూడా బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరమని యూనియన్ తెలిపింది.
ఈ పరిస్థితిపై రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని టీజేయూ డిమాండ్ చేసింది.







