తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల ఫోరం నాయకులను సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఉద్యమకారుల ఫోరం హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు జెకె తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తమ మేనిఫెస్టో హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల భూమి, పెన్షన్, సంక్షేమ బోర్డు వంటి హామీలు ఇచ్చిందని, అయితే రెండేళ్లు గడుస్తున్నా వాటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని జెకె ఆరోపించారు. ప్రభుత్వాల కాలయాపనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
సెక్రటేరియట్ ముట్టడి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్, జిల్లా అధ్యక్షుడు కనకం కుమార స్వామి, వందలాది మంది నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని, అక్రమమని జెకె విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన వారికి న్యాయం జరగకపోతే అది ప్రభుత్వాలకు మంచిది కాదని హెచ్చరించారు.
తక్షణమే ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యమకారులకు 250 గజాల భూమి, పెన్షన్, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై స్పష్టమైన విధివిధానాలను ప్రకటించి, కమిటీని ఏర్పాటు చేయాలని జెకె డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు.











