తమ న్యాయమైన హక్కుల సాధన కోసం విద్యుత్ ఆర్టిసన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మూడో రోజుకు చేరుకుంది. తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మెలో భాగంగా, కార్మికులు కీసర డివిజన్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
జేఏసీ చైర్మన్ జహంగీర్, కన్వీనర్ చాగంటి సత్యనారాయణ మాట్లాడుతూ, ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థలకు సేవలు అందిస్తున్న తమను అన్యాయంగా పరిగణిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రధాన డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
కార్మికుల ప్రధాన డిమాండ్లలో ఆర్టిసన్ కార్మికులకు వెంటనే ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయడం, అర్హత ఉన్నప్పటికీ ఆర్టిసన్లుగా గుర్తింపు పొందని వారికి ఆ హోదా కల్పించడం, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్-మాన్ కార్మికులను ఆర్టిసన్లుగా మార్చడం వంటివి ఉన్నాయి. జీవో నం. 11 ప్రకారం పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనం చెల్లించి, 30 రోజుల పని దినాల భద్రత కల్పించాలని కూడా వారు కోరుతున్నారు.
శాంతియుతంగా చేపట్టిన తమ నిరసనలను ప్రభుత్వం, యాజమాన్యం పట్టించుకోకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. “చీకటిలో వెలుగులు నింపే మేమే.. మా జీవితాల్లో చీకటి నింపే విధానాలను సహించం” అని కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.











