తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఓటరు జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా చేపడుతున్న మ్యాపింగ్ పనుల పురోగతిపై జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, మ్యాపింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో, జిల్లాల్లో మ్యాపింగ్ శాతం ఆశించిన స్థాయికి చేరేలా మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు, తొలగింపు, సవరణలకు సంబంధించిన ఫారం-6, 7, 8ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలను క్రమబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు.
రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకంలో చురుకుదనం చూపాలని, ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగాలని స్పష్టం చేశారు. SIR కు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లను త్వరగా పూర్తి చేసి, ఎన్నికల నిర్వహణకు పటిష్ట పునాది వేయాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికల సిద్ధతపై జిల్లా కలెక్టర్ వివరాలు అందజేశారు.












