ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆయన సూచించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని, సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
సంగారెడ్డి పట్టణంలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్, ఆర్ అండ్ బి రోడ్ల డివైడర్లపై ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు, సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. సింగూర్ డ్యాం వద్ద బారీకేడ్లు, హెచ్చరిక సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను 30 రోజుల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో డివిజన్ వారీగా మొత్తం 108 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.












