హైదరాబాద్ కేంద్రంగా మూడు హైస్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) కారిడార్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. ఈ ప్రతిపాదనలలో భాగంగా, శంషాబాద్ వద్ద నిర్మించనున్న హైస్పీడ్ రైల్ టెర్మినల్‌ను మెట్రో రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె నగరాలకు మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించింది. ఈ రైళ్లు గంటకు 300-350 కి.మీ. వేగంతో ప్రయాణించనున్నాయి. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో బహదూర్‌గూడ, రషీద్‌గూడ ప్రాంతాల్లో భారీ టెర్మినల్ నిర్మాణం కోసం సుమారు 500 ఎకరాల భూమిని సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపింది.
మెట్రో రెండో దశలో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గాలను ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ టెర్మినల్‌తో నేరుగా కలపాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్ ఒకేచోట కలిసేలా ఒక మెగా జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ మెగా ప్రాజెక్టుపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, నివేదిక సమర్పించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రాజెక్టు నగరం యొక్క రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని భావిస్తున్నారు.

