రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మార్చి నెలలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో, ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల ప్రశంసించారు. వారికి ప్రశంస పత్రాలను అందజేశారు.
జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల మాట్లాడుతూ, వివిధ రకాల పెండింగ్ కేసులను పరస్పర అవగాహనతో త్వరితగతిన పరిష్కరించడంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసిందని కొనియాడారు. ప్రజలకు న్యాయం సకాలంలో అందేలా పోలీసు శాఖ చేసిన కృషిని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలీసు అధికారులు, ప్రజలు, న్యాయ వ్యవస్థ మధ్య సమన్వయం వల్లే లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
డీసీపీ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ, లోక్ అదాలత్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి న్యాయపరంగా సహకరించిన న్యాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా న్యాయస్థానం, పోలీసు శాఖల మధ్య ఉన్న సమన్వయం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల, అదనపు జిల్లా న్యాయమూర్తి కె. స్వప్న రాణి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వి. భావాని, జూనియర్ సివిల్ జడ్జి ఎన్. మంజుల, పెద్దపల్లి, గోదావరిఖని ఏసీపీలు ఎం. రమేష్, జి. కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, మంథని సీఐ రాజు, ఏపీపీ పి. రాకేష్, పలువురు న్యాయమూర్తులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. లోక్ అదాలత్ ద్వారా అనేక కేసుల సత్వర పరిష్కారం ప్రజలకు ఊరటనిచ్చింది.











