*భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..*
భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం నడుస్తోంది. భారత త్రివిధ దళాలు పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. నావికాదళం దెబ్బకు నిన్న కరాచీ పోర్టు ధ్వంసం అయింది. పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో మిస్సైల్ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మధ్యలో తాము కలుగజేసుకోమని స్పష్టం చేశారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కబడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలను యుద్ధం ఆపమనే స్థితిలో అమెరికా లేదని అన్నారు.
ఇక, భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణంపై కొన్ని రోజుల క్రితం రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా స్పందించారు. రెండు దేశాల మధ్య పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండేలా.. రెండు దేశాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. అమెరికా రష్యాతో పాటు మరికొన్ని దేశాలు కూడా యుద్ధ వాతావరణంపై స్పందించాయి. ఈ దేశాలు మొత్తం యుద్ధం మొదలుకానపుడు స్పందించాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో నార్త్ కొరియా మద్దతుపై మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ప్రపంచం మొత్తం ఒక తీరు.. మేము ఒక తీరు అనే నార్త్ కొరియా.. ఈ యుద్దంలో ఎవరికి సపోర్టు చేసే అవకాశం ఉంది.. పాకిస్తాన్‌కా లేక ఇండియాకా ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియా, నార్త్ కొరియా సంబంధాలు
నార్త్ కొరియాతో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. 1962 నుంచి ఆ సంబంధాలు కొనసాగుతున్నాయి. చాలా సందర్భాల్లో నార్త్ కొరియాకు మానవతా దృక్పథంతో ఇండియా సాయం చేసింది. అదే విధంగా నార్త్ కొరియా కూడా ఇండియాకు సాయం చేసింది. డిమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని పిలవబడే నార్త్ కొరియాకు ఇండియాకు మధ్య చాలా ఏళ్ల పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పలు ఒప్పందాలు జరిగాయి. వాణిజ్య పరంగా కూడా రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. 2004లో భారత దేశంలో సునామీ వచ్చినపుడు నార్త్ కొరియా 30 వేల డాలర్ల ఆర్థిక సాయం చేసింది. కరోనా సమయంలో ఇండియా, నార్త్ కొరియాకు అండగా నిలిచింది. వైద్య పరమైన సాయం అందించింది.
పాక్ , నార్త్ కొరియా సంబంధాలు
1970 నుంచి 1990 వరకు పాకిస్తాన్, నార్త్ కొరియాకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. మరీ ముఖ్యంగా మిలటరీ, న్యూక్లియర్ కోఆపరేషన్ విషయంలో సంబంధాలు బాగా ఉండేవి. అయితే, గత కొన్నేళ్ల నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. కిమ్ జాంగ్ ఉన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాకిస్తాన్ కంటే.. ఇండియా వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఒక వేళ మద్దతు అవసరం అన్నపుడు కిమ్ జాంగ్ ఉన్ ఇండియా వైపు నిలబడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.