రోడ్డు భద్రతను పెంపొందించేందుకు మరియు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ కార్యక్రమం అమలులోకి వచ్చింది.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
డీసీపీ కార్యాలయంతో పాటు, మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేసే సిబ్బంది హెల్మెట్ లేకుండా వస్తే కార్యాలయ ఆవరణలోకి అనుమతించబడరని స్పష్టం చేశారు. హెల్మెట్ వినియోగం కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదని, వ్యక్తిగత భద్రతకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా హెల్మెట్ వినియోగంపై కఠిన నియంత్రణలు అమలు చేస్తూ, ప్రజల్లో రోడ్డు భద్రతపై బాధ్యతాయుత దృక్పథం పెంపొందించడం లక్ష్యంగా పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. ప్రజలు తమ ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారులు పిలుపునిచ్చారు.
“అరైవ్ అలైవ్” కార్యక్రమం రోడ్డు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని, హెల్మెట్ ధరించడం ద్వారా అనేక అమూల్యమైన జీవితాలను కాపాడవచ్చని అధికారులు తెలిపారు. ఈ నిబంధనలు ప్రజల భద్రత కోసమే అని వారు నొక్కి చెప్పారు.











