నిజామాబాద్, ఆగస్టు 1
నిజామాబాద్ నగరంలో ఆదివారం (ఆగస్టు 2) నిర్వహించనున్న సంప్రదాయ ఊరపండుగ సందర్భంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయి.
నగరంలో ఆదివారం (ఆగస్టు 2) నిర్వహించనున్న సంప్రదాయ ఊరపండుగ సందర్భంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఊరేగింపు ఉదయం 6 గంటలకు ఖిల్లా చౌరస్తా నుంచి ప్రారంభమై వివేకానంద విగ్రహం, గాజులపేట, గురుద్వారా, లక్ష్మీ మెడికల్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్‌నగర్, దుబ్బ ప్రాంతాల వైపు కొనసాగుతుంది.
ఈ నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బోధన్ వైపు నుంచి వచ్చే, వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలను బైపాస్ మార్గం మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు. ఈ వాహనాలు ఆర్టీసీ బస్టాండ్ వెనుక నుంచి రైల్వే స్టేషన్, ఎన్టీఆర్ చౌరస్తా, జడ్పీ చౌరస్తా, కంఠేశ్వర్, మీ-సేవ కేంద్రం, కంఠేశ్వర్ బైపాస్, ఐడీఓసీ మీదుగా అర్సపల్లికి చేరుకుని బోధన్ వైపు ప్రయాణించాల్సి ఉంటుందని సూచించారు.
అయితే హైదరాబాద్, బాన్సువాడ ప్రాంతాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా తమ మార్గాల్లోనే ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు.
నగర ప్రజలు ఈ ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలను ముందస్తుగా ప్రణాళిక చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.












