పెట్టుబడి సాయం కోసం రైతన్నల ఎదురుచూపు…

రైతుకు ‘భరోసా’ కరువు!!!

పెట్టుబడి సాయం కోసం రైతన్నల ఎదురుచూపు..

మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుతోనే సరిపుచ్చిన ప్రభుత్వం..

అసెంబ్లీలో చర్చ లేదు..మార్గదర్శకాల ముచ్చటే లేదు.

నెల రోజుల్లో ముగియనున్న వానాకాలం సీజన్‌..

IMG 20240826 WA0015

పంటల సీజన్‌ మరో నెల రోజుల్లో ముగియనున్నా రైతుభరోసా కింద ఇంతవరకు ఆర్థిక సాయం అందలేదు. మరోవైపు రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. దీంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంటల సాగుకు పెట్టుబడి కరువై రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్‌లో అసలు రైతుభరోసా కింద ఆర్థిక సాయం అందుతుందా లేదా అన్న విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేకపోతుండటంతో అయోమయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు.

 

పునఃసమీక్ష ప్రకటనతో సరి!

కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా (గతంలో రైతుబంధు) మొత్తాన్ని సీజన్‌కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇస్తామని చెప్పింది. ఈ వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు నిబంధనలు పునఃసమీక్ష తర్వాత అర్హులకు రైతుభరోసా ఇస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం కింద అసలు రైతుల కన్నా ధనికులు, అనర్హులే ఎక్కువ లబ్ధి పొందారనేది కొత్త సర్కారు ఉద్దేశం. గతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపచేసి 12 విడతల్లో దాదాపు రూ. 25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పున:సమీక్ష అనంతరం ఈ వానాకాలం సీజన్‌ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమల్లోకి తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం ముఖ్యంగా రైతుభరోసాకు సీలింగ్‌ విధించాలన్న ఆలోచనలో ఉందని అంటున్నారు. అందరికీ కాకుండా ఐదు లేదా పదెకరాలకు దీనిని పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా గత యాసంగి సీజన్‌లో మొత్తం 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుబంధు అందుకున్నవారిలో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం. కాగా ఐదెకరాలకు పరిమితం చేస్తే 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందనేది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. ఇక ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న వారు 10.89 లక్షల మంది, మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న వారు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య 5.72 లక్షల మంది ఉండగా వారి చేతిలో 31.04 లక్షల ఎకరాల భూమి ఉంది. పదెకరాల వరకు ఇస్తే, రైతు భరోసాకు వీరు కూడా తోడవుతారు. జూలై 2వ తేదీన రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటైంది. అందులో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు,పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబులను సభ్యులుగా నియమించారు. అప్పటినుంచి 15 రోజుల్లోగా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇవ్వాలి. ఆ నివేదికపై అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అసెంబ్లీ ఆమోదం తర్వాత మార్గదర్శకాలు జారీచేసి రైతులకు పెట్టుబడి సాయం చేస్తామని సర్కారు ప్రకటించింది.జూలై 15వ తేదీన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఆధ్వర్యంలో వరంగల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు భరోసాపై అభి ప్రాయాలు తీసుకున్నారు. అలాగే ఆదిలాబాద్‌ సహా కొన్ని జిల్లాల్లోనూ అభిప్రాయాలు తీసుకున్నారు.జూలై 23వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ అసెంబ్లీ సమావేశాల్లో రైతుభరోసా ఊసే ఎత్తలేదు. దీంతో మార్గదర్శకాలు ఖరారు కాలేదు.

Join WhatsApp

Join Now