సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): ముందస్తు చర్యలే గొర్రెల ప్రాణాలను కాపాడుతాయని వ్యాధుల నివారణకి టీకాలు ప్రధాన సాధనమని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన గొర్రెలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధి వల్ల గొర్రెలకాపరులు తీవ్రంగా నష్టపోతున్నారని, గొర్రెలలో నీలి నాలుక వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం ప్రభుత్వం గొర్రెలకు ఉచితంగా నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నదని గొర్రెల పెంపకం దారులకు సూచించారు. నీలి నాలుక వ్యాధి వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ వ్యాధి సోకిన గొర్రెలకు జ్వరం రావడం నోరు వాచి నీరు వదలడం లాంటి లక్షణాలతో గొర్రెలు చివరికి మరణించడంతో గొర్రెల పెంపకం దారులు తీవ్రంగా నష్టపోతున్నారని, అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం గొర్రెలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమాన్ని గొర్రెల పెంపకందారులు వినియోగించుకోవాలని అన్నారు. సకాలంలో తమ గొర్రెలకు నీలి నాలుక వ్యాధి టీకాలు వేయించడం వల్ల వ్యాధి నుండి తమ గొర్రెలకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి గ్రామంలో పదిమంది గొర్రెల కాపరులకు చెందిన 900 గొర్రెలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు వేయించాలని అధికారులకు సూచించారు. గొర్రెల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిణి వసంతకుమారి, పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు, వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.
గొర్రెలలో వ్యాధి నివారణకు టీకాలు వేయించడమే ప్రధానం: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
Published On: August 1, 2025 3:58 pm