నకిలీ నోట్ల ముఠా సస్యం మీద పీడీ యాక్ట్ పడింది
సమాజంలో భయం, అశాంతి సృష్టించే నేరగాళ్లపై కఠిన చర్యలు అవసరం:
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 21:
అంతర్రాష్ట్ర నకిలీ నోట్ల ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రధాన నిందితుడు కరెన్సీ కాట్ని అలియాస్ లఖన్ కుమార్ దుబేపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం ప్రకటించారు. కామారెడ్డి వైన్‌షాప్‌లో రెండు నకిలీ ₹500 నోట్లు వినియోగించిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు తెలంగాణ, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 8 మందిని అక్టోబర్ 11న అరెస్ట్ చేశారు. లఖన్‌పై కామారెడ్డి, కోల్‌కతాల్లో కేసులు ఉన్నాయని, ప్రస్తుతం నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉండగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జారీ చేసిన పీడీ ఉత్తర్వులను టౌన్ సీఐ నరహరి, హెడ్ కానిస్టేబుల్ నర్సింలు అందజేశారని ఎస్పీ తెలిపారు. నకిలీ కరెన్సీ చలామణి ప్రజల్లో భయం, అనిశ్చితి సృష్టిస్తోందని, శాంతి భద్రత కోసం ఇలాంటి నేరగాళ్లను నిర్బంధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పీడీ యాక్ట్ ప్రకారం నిందితుడు ఒక సంవత్సరం వరకు నిర్బంధంలో ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పారు. నేరాలు మానుకుని బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని ఎస్పీ సూచించారు.