కామారెడ్డి, 02.07.2026
కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు CCTNS ద్వారా నేరాల పురోగతి, నియంత్రణ చర్యలు, దర్యాప్తు పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన దర్యాప్తుతో కేసులను సకాలంలో పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలని, పెండింగ్ కేసులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, IPS గారు CCTNS ద్వారా జిల్లాలో నమోదైన కేసుల పురోగతి, నేర నియంత్రణ చర్యలు, దర్యాప్తు పనితీరుపై నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నమోదవుతున్న ప్రతి కేసును నాణ్యమైన దర్యాప్తుతో చట్టపరమైన గడువులోగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసులను ప్రత్యేక దృష్టితో పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేసి, సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేయడం ద్వారా నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు.
CCTNS 2.0 అమలులో భాగంగా నమోదైన ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను నిర్దేశిత గడువులోగా పూర్తిస్థాయిలో ఆన్లైన్లో నమోదు చేసి ఎలాంటి పెండెన్సీ లేకుండా ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు. జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలు, మట్కా, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో బస్సులు, అనుమానాస్పద వాహనాలు, కీలక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పగలు, రాత్రి బీట్ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదలు, భారీ వర్షాలు, ఇతర అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, అధిక వేగంతో వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులు, తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.











