నిజామాబాద్, 2026-07-25
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎస్సీఈఆర్టీ శిక్షణ కార్యక్రమాల్లో అవకతవకలు జరిగాయని, బాల్కొండ కోర్స్ డైరెక్టర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన నోటుబుక్కులను ఉపాధ్యాయులకు అందజేయడం ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఎస్సీఈఆర్టీ శిక్షణ కార్యక్రమాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై బాల్కొండ కోర్స్ డైరెక్టర్‌పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.
ఈ నెల 13, 14, 15 తేదీల్లో బాల్కొండలో నిర్వహించిన సాంఘిక శాస్త్రం శిక్షణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన నోటుబుక్కులను ఉపాధ్యాయులకు అందజేశారని ఆయన ఆరోపించారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో పేద విద్యార్థులకు చేరాల్సిన విద్యా సామగ్రిని శిక్షణ అవసరాలకు వినియోగించడం ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, నాణ్యతలేని విద్యా సామగ్రిని పంపిణీ చేయడం, శిక్షణ కార్యక్రమాల పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో బాల్కొండ కోర్స్ డైరెక్టర్‌పై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కృపాల్ సింగ్ సోడి ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం విద్యార్థుల కోసం కేటాయించిన విద్యా సామగ్రిని నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగానే వినియోగించేలా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.










