ప్రపంచ అటవీ దినోత్సవం, పిచ్చుకల దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పాల్గొని అడవుల సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అడవుల పెంపకం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డి జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ అటవీ దినోత్సవం, పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని, పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటే అలవాటు పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. "అటవీ సంరక్షణే దేశ సంరక్షణ" అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
పిచ్చుకల సంరక్షణపై దృష్టి సారించాలని, ఇంటి వద్ద నీటి గిన్నెలు ఉంచడం, చిన్న గూళ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ప్రాణవాయువుకు చెట్లే ఆధారమని, ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించాలని, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారిణి నిఖిత, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొని పర్యావరణ పరిరక్షణకు మద్దతు తెలిపారు. సారధి కళాకారులు "చెట్టూ చెట్టమ్మను నేను… చెట్టును నేనురా…" వంటి గీతాలతో సందేశాత్మక ప్రదర్శనలు ఇచ్చారు. అటవీ సంరక్షణపై పోస్టర్ను ఆవిష్కరించారు.












