నిజామాబాద్, జూలై 17
బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, మౌలిక సదుపాయాల విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, పారిశుధ్య కాంట్రాక్టు సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.
బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, మౌలిక సదుపాయాల విస్తరణకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్య సేవలతో ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని ఆమె సూచించారు.
శుక్రవారం ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ అవుట్పేషంట్ విభాగం, ప్రసూతి వార్డు, టీకాల గది, శస్త్రచికిత్స అనంతర వార్డు తదితర విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణతో పాటు శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ భవనాన్ని కూడా పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పారిశుధ్య కాంట్రాక్టు సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు.
అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి, ఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి నిర్వహణ, రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలించి, సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.
బాన్సువాడతో పాటు సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణులు ఈ ఆసుపత్రికి వస్తున్నారని, నెలకు సుమారు 200 ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బర్త్ వెయిటింగ్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మెడికో-లీగల్ కేసులు అధికంగా నమోదవుతున్నందున భద్రత దృష్ట్యా ఆసుపత్రిలో పోలీసు అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని పోలీసు శాఖకు ప్రతిపాదిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, సీజనల్ వ్యాధులను నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మందులు, వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసిన కలెక్టర్, తాను తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు. స్థానిక ఆర్డీవో ఆధ్వర్యంలో ప్రతి పక్షం రోజులకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించి, ఆసుపత్రి పనితీరుపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, వైద్యాధికారులు పాల్గొన్నారు.












