నిజామాబాద్, 2026-07-14
టీకాల ద్వారా నివారించగల వ్యాధుల గుర్తింపు, పర్యవేక్షణ, నివేదికల నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణలో భాగంగా, ఇకపై వ్యాధుల నమోదును జిల్లా స్థాయి కాకుండా నేరుగా పీహెచ్సీ స్థాయిలోనే చేపట్టనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ తెలిపారు.
టీకాల ద్వారా నివారించగల వ్యాధుల (వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్) గుర్తింపు, పర్యవేక్షణ, నివేదికల నిర్వహణపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నమూనాలను సేకరించి, నిర్దేశిత విధానంలో పరీక్షలకు పంపాలని వైద్యాధికారులకు సూచించారు.
ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్‌గా పాల్గొన్న బాల వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ఎనిమిది జిల్లాల్లో నిజామాబాద్ కూడా ఒకటని తెలిపారు. ఇకపై వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (VPD-SIMS) పోర్టల్ ద్వారా జిల్లా స్థాయిలో కాకుండా నేరుగా పీహెచ్సీ స్థాయిలోనే వ్యాధుల నమోదును చేపట్టనున్నట్లు చెప్పారు.
శిక్షణలో భాగంగా టీకాల ద్వారా నివారించగల వ్యాధుల తీవ్రత తగ్గించడం, వ్యాధుల వ్యాప్తిని ముందుగానే గుర్తించడం, టీకా కార్యక్రమాల నాణ్యతను సమీక్షించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం పర్యవేక్షణ చేపట్టడం, నిర్దేశిత గడువులో చర్యలు పూర్తి చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
పోలియో, మీజిల్స్–రూబెల్లా, డిఫ్తీరియా వంటి వ్యాధుల లక్షణాలతో ఒకే ప్రాంతంలో ఐదుకు పైగా కేసులు నమోదైతే దానిని వ్యాధి వ్యాప్తి (అవుట్‌బ్రేక్)గా పరిగణిస్తామని వివరించారు. అక్యూట్ ఫ్లాసిడ్ పారాలసిస్ (AFP) కేసులు గుర్తించిన వెంటనే మల నమూనాలు సేకరించాలని, జ్వరం, చర్మంపై దద్దుర్లు ఉన్న అనుమానిత కేసుల్లో ముక్కు, గొంతు స్వాబ్లు, సీరం లేదా మూత్ర నమూనాలను సేకరించి నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం హైదరాబాద్‌కు పంపాలని సూచించారు.
జిల్లాలో ఈ ఏడాది లక్ష్యంగా ఉన్న 10 ఏఎఫ్‌పీ కేసుల్లో రెండు నమూనాలు పంపినట్లు తెలిపారు. అలాగే మీజిల్స్–రూబెల్లా కేసులలో లక్ష్యంగా ఉన్న 35 నమూనాలకు గాను 22 నమూనాలు పంపగా, వాటిలో 14 పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ అశోక్, ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్ డాక్టర్ అజ్మల్, డాక్టర్ శ్రావ్య, డీడీఎం పృథ్వి, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ విద్య, డాక్టర్ సికందర్ నాయక్, బాల వైద్య నిపుణులు డాక్టర్ శరణ్య, డాక్టర్ ప్రసన్న, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శిఖర్, ఎస్వో రాజేశ్వర్, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్‌ఈఓ గన్పూర్ వెంకటేశ్వర్లు, డీపీఓ విశాల, వినోద్‌తో పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల వైద్యాధికారులు, రిపోర్టింగ్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.











