Kamareddy/Banswada (ప్రశ్న ఆయుధం) జూలై 10
ప్రపంచ జనాభా దినోత్సవం-2026 పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలో జూలై 11 నుండి 18 వరకు ప్రత్యేక కుటుంబ నియంత్రణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యవంతమైన తల్లి, శిశువు, సంతోషకరమైన కుటుంబమే లక్ష్యంగా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. జె. వెంకటి తెలిపారు.
ప్రపంచ జనాభా దినోత్సవం-2026 సందర్భంగా, కామారెడ్డి జిల్లాలో జూలై 11 నుండి 18 వరకు ప్రత్యేక కుటుంబ నియంత్రణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. జె. వెంకటి తెలిపారు. ఆరోగ్యవంతమైన తల్లి, ఆరోగ్యవంతమైన శిశువు, సంతోషకరమైన కుటుంబమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఈ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో కుటుంబ నియంత్రణ సేవలపై అవగాహన పెంపొందించడం, పిల్లల మధ్య సరైన విరామం పాటించడం, తల్లి-శిశు మరణాలను తగ్గించడం, అధిక ప్రమాద గర్భధారణలను నివారించడం, ఆరోగ్యవంతమైన కుటుంబాలను నిర్మించడం ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సంవత్సరపు సందేశం "పిల్లలకు సరైన అంతరం ఉంటే, కుటుంబాలు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటాయి." దీనిని గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆరోగ్య కేంద్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
జూలై 11 నుండి 18 వరకు జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, ఆరోగ్య & వెల్నెస్ కేంద్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కుటుంబ నియంత్రణపై అవగాహన ర్యాలీలు, గ్రామ సభలు, మహిళా సంఘ సమావేశాలు, యువ దంపతులకు ప్రత్యేక కౌన్సెలింగ్, గర్భిణీలు, బాలింతలకు అవగాహన, అర్హులైన దంపతుల గుర్తింపు, ఇంటింటి ప్రచారం, ఆరోగ్య విద్య కార్యక్రమాలు, పోస్టర్లు, కరపత్రాల పంపిణీ, ప్రత్యేక కుటుంబ నియంత్రణ శిబిరాలు, గ్రామ స్థాయిలో ఆశా, ANMల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ప్రభుత్వం ఉచితంగా అందించే తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులలో కండోమ్లు, మౌఖిక గర్భనిరోధక మాత్రలు (OCP), అత్యవసర గర్భనిరోధక మాత్రలు, ఛాయా మాత్రలు, అంతర (ANTARA) గర్భనిరోధక ఇంజెక్షన్, IUCD (Copper-T), PPIUCD (ప్రసవానంతర కాపర్-టి) అందుబాటులో ఉంటాయి. శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులలో మహిళలకు ట్యూబెక్టమీ, పురుషులకు నో-స్కల్పెల్ వాసెక్టమీ (NSV) సేవలు ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో నిపుణులైన వైద్యులచే సురక్షితంగా, పూర్తిగా ఉచితంగా అందించబడతాయి.












