దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన ప్రక్రియ నేపథ్యంలో, ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై కేంద్ర హోం శాఖ తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఆదేశాలు 2027 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.
కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, జనగణన రెండు దశల కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఉద్యోగుల సాధారణ బదిలీలను నిలిపివేయాలి. ఈ ప్రక్రియ 2027 మార్చి 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది.
జనగణనలో పాల్గొనే ఉద్యోగులకు ఇప్పటికే శిక్షణ ప్రారంభమైంది. తెలంగాణలో 85 వేల మందికి పైగా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. మొదటి దశ ఇంటింటి సర్వే వచ్చే నెల 11 నుంచి జూన్ 9 వరకు జరగనుంది. ఆన్లైన్లో కుటుంబ వివరాల నమోదుకు ఈ నెలాఖరు నుంచే అవకాశం ఇవ్వనున్నారు.
రెండో దశలో భాగంగా, 2027 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. జనాభా లెక్కల సేకరణ రాజ్యాంగబద్ధమైన విధిగా పరిగణించబడుతుంది.
1948, 1990 నాటి మార్గదర్శకాల ప్రకారం, జనగణన పూర్తయ్యే వరకు ఉద్యోగులను బదిలీ చేయరాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రాలు కూడా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.











