రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేసేందుకు, అక్రమంగా పశువులను తరలించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తెలిపారు. జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు.
కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను డీసీపీ సందర్శించి, భద్రతా చర్యలను పరిశీలించారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో అక్రమ జంతు రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పశువుల సంతలు, బక్రీద్ పండుగ దృష్ట్యా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల పనితీరుపై అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు డీసీపీ వివరించారు.
జిల్లాలో చట్టవిరుద్ధంగా ఆవులు, దూడలను అక్రమంగా రవాణా చేయడం, వధించడం పూర్తిగా నిషేధమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర వైపు నుంచి అక్రమ ధాన్యం రవాణా జరగకుండా వ్యవసాయ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుని తనిఖీలు నిర్వహించాలని సూచించారు. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పశువులను తరలించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.











