భారత్ ఫ్యూచర్ సిటీ ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నెట్ జీరో సిటీ తరహాలో డిజైన్స్ ఉండాలని, మౌలిక వసతుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్: ఎమ్సీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై నిర్వహించిన సమీక్షలో ఫ్యూచర్ సిటీ డిజైన్లకు సంబంధించి పలు కీలక సూచనలు చేశారు. నెట్ జీరో సిటీ తరహాలోనే ఈ నగరం రూపుదిద్దుకోవాలని, మౌలిక వసతుల కల్పనలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని, ఇందులో ఎటువంటి రాజీ పడరాదని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేసి, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి తర్వాతే భూ కేటాయింపులు చేపట్టాలని సూచించారు.
ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్ట్‌లకు 500 ఎకరాలు కేటాయించాలని సీఎం తెలిపారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్‌ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేద్దామని అన్నారు. జూన్‌లో ఇండ్రస్టియల్ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా చూడాలని, భూ కేటాయింపు జరిగిన వెంటనే నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలని ఆదేశించారు.
పెట్టుబడుల ఆకర్షణకు 'ఇన్వెస్ట్ తెలంగాణ' పేరుతో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, దీనికి ఆకర్షణీయమైన లోగో, వెబ్సైట్ రూపొందించాలని ఆదేశించారు. పెట్టుబడిదారుల కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థను రూపొందించాలని, గ్రూప్ 1 అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేయాలని, బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించారు.
1500 ఎకరాల్లో డేటాసిటీ ఏర్పాటు చేయాలని, నీటి అవసరాల కోసం ఎస్టీపీలను వినియోగించాలని సూచనలు చేశారు. జీసీసీలు, డేటా సెంటర్లు కోసం కరీంనగర్, వరంగల్, విజయవాడ రోడ్ల సమీపంలో ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీ ఏర్పాటుపై దృష్టి పెట్టేలా పాలసీ రూపకల్పన చేయాలన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్‌కు కనెక్ట్ కావాలని ఆదేశించారు. ఈ సమావేశానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.











