కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై తక్షణమే విచారణ ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం ఆదేశించారు.
మే 8న ఫిర్యాదు అందినప్పటికీ, ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి డీజీపీని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందువల్ల విచారణ ఆలస్యమైందని డీజీపీ వివరించారు. కేసులో సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
బండి భగీరథ్‌పై ఒక మైనర్ బాలిక పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనను వేధిస్తున్నారని, పోక్సో కింద కేసు నమోదు చేయాలని ఆమె కోరింది. అయితే, ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నాయి.
ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో కేసు విచారణ వేగవంతం అవుతుందని భావిస్తున్నారు.











