సికింద్రాబాద్ చిలకలగూడలో ఇటీవల జరిగిన యావన్ హత్య కేసులో పోలీసులు 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని, పక్కా ప్రణాళికతోనే హత్యకు పాల్పడ్డారని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితా మూర్తి వెల్లడించారు.
చిలకలగూడలో యావన్ అనే యువకుడు స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా, కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తులో భాగంగా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో యువతి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు తెలిసింది.
డీసీపీ రక్షితా మూర్తి తెలిపిన వివరాల ప్రకారం, ఈ హత్య కేసులో సాయి కిరణ్ ప్రధాన సూత్రధారి. యావన్‌కు ఒక యువతితో స్కూల్ రోజుల నుంచి పరిచయం ఉందని, గత రెండేళ్లుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, అయితే ఈ విషయం యువతి తల్లిదండ్రులకు నచ్చకపోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు.
హత్యకు నాలుగు రోజుల ముందు నుంచే నిందితులు యావన్‌ను చంపేందుకు ప్రణాళిక రచించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మే 7వ తేదీన యావన్ తన స్నేహితుడి ఇంటికి వచ్చిన సమయంలో, నిందితులు అక్కడికి చేరుకుని గొడవపడి, కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో యావన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఇద్దరికి గంజాయి వాడకం పాజిటివ్‌గా వచ్చినట్లు డీసీపీ తెలిపారు.











