ఎర్రటి ఎండలో బిడ్డను ఒడిలో పెట్టుకుని భిక్షాటన చేస్తున్న ఓ తల్లి వ్యవహారం బాపట్లలో కలకలం రేపింది. బాలల సంరక్షణ అధికారులు కళ్ళు మూసుకుని కూర్చున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నదిలో మునిగిపోయి తల్లికొడుకులు మృతి చెందిన విషాద ఘటన మరవకముందే, బాపట్లలో మరో తల్లి తన బిడ్డను ఎండలో తిప్పుతూ భిక్షాటన చేస్తూ కనిపించింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ అధికారులు చిన్నారుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో అలాంటి చర్యలు కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన రహదారులలో చిన్నారుల చేత భిక్షాటన చేయిస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రోజువారీ ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నా, అధికారులు పట్టించుకోకపోవడం చిన్నారులకు శాపంగా మారుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను అధికారులు విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి, బాలల చేత భిక్షాటన చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్నారులకు సరైన ఆశ్రయం, విద్య కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.











