భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు, భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ అహంకారమే ఆయన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌజ్‌కు పరిమితం కావడానికి కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు.
కేటీఆర్‌ను చూసి బీఆర్ఎస్ కార్యకర్తలే అసహ్యించుకుంటున్నారని ఎద్దేవా చేసిన బండి సంజయ్, కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా, బండి సంజయ్ నేతృత్వంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి అమీర్‌పేట వరకు జరిగిన బైక్ ర్యాలీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మాదిరిగా దోచుకోవడం, రైతులకు బేడీలు వేసి అరిగోస పెట్టడం, డ్రగ్స్ తీసుకోవడం, కాళేశ్వరం, ఈ-ఫార్ములా, విద్యుత్ కొనుగోళ్ల అవినీతి, ఫాంహౌజ్ డ్రగ్స్ కేసులు, మంది కొంపలు ముంచడం, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేలా చేయడం వంటివి తమకు తెలియదని బండి సంజయ్ పేర్కొన్నారు. తమకు ఏమి తెలుసో ప్రజలే నిర్ణయిస్తారని, ప్రజలు కేటీఆర్‌ను, బీఆర్ఎస్ను గ్రహించి ఓడించారని ఆయన ఎద్దేవా చేశారు.
కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అహంకారం చూపించి, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కాళ్లు మొక్కుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఇక అధికారంలోకి రావడం అసాధ్యమని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి నిధులు తెస్తున్నామని చెబుతుంటే, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ సొమ్మును ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారని ఆయన ఆరోపించారు.
మరోవైపు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోటి దురుసుతనమే తమ పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి కారణమని బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ అన్నారు.











