తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల మద్దతును సమీకరించడంలో టీవీకే పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆ పార్టీ అనుభవలేమి, సరైన వ్యూహరచన లోపంపై రాజకీయ విశ్లేషకులు లోతుగా చర్చిస్తున్నారు. పార్టీ ఆవిర్భవించి రెండేళ్లు కాకముందే అధికారానికి దగ్గరగా వచ్చినప్పటికీ, కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం పార్టీని వెనక్కి లాగుతోందని అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, మద్దతు కోరుతూ పార్టీల అధినేతలను నేరుగా కలవకుండా, 'కామన్ లెటర్'ను వాట్సాప్ ద్వారా పంపించడం టీవీకే పార్టీకి ప్రతికూలంగా మారిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ చర్యతో ఆయా పార్టీలు టీవీకేను తక్కువ అంచనా వేసినట్లు, దీంతో మద్దతు సమీకరణ ప్రక్రియ క్లిష్టంగా మారినట్లు అభిప్రాయపడ్డారు.
పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన టీవీకే నేతలు, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలను నేరుగా కలిసి మద్దతు కోరడంతో, ఆయా పార్టీలు మద్దతుపై ఆలోచన ప్రారంభించాయి. అయితే, పార్టీల బలాబలాలు, భావసారూప్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం లేఖలు పంపడంపైనే దృష్టి సారించడం, కాంగ్రెస్ పార్టీ సహకారాన్ని తీసుకోకపోవడం వంటివి టీవీకే వ్యూహంలోని లోపాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గవర్నర్ రెండుసార్లు తిరస్కరించిన నేపథ్యంలో, చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సంప్రదించినట్లు సమాచారం. తమిళనాట టీవీకేకు మద్దతిచ్చే పార్టీలు కరువవడంతో, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగి, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల నేతలతో మాట్లాడటంతో, ఆయా పార్టీలు మద్దతు ఇచ్చేందుకు కొంతవరకు సానుకూలంగా మారాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టీవీకే పార్టీలో కేవలం కేఏ సెంగోట్టయ్యన్‌కు మాత్రమే రాజకీయ, పాలనాపరమైన అనుభవం ఉందని, మిగిలిన వారంతా కొత్తవారే కావడంతో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరుతూ టీవీకే నేతలు వాట్సాప్‌లో లేఖ పంపించడం సరైన పద్ధతి కాదని వీసీకే ప్రధాన కార్యదర్శి చిందనై సెల్వన్ ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ శాసనసభాపక్షం సమావేశమై తమ నేతను ఎన్నుకుని, ఆ విషయాన్ని గవర్నర్‌కు అధికారికంగా తెలియజేయాలి. కానీ, టీవీకే పార్టీ గవర్నర్‌కు ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపించడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో లోక్‌భవన్ నుంచి ఏం జరిగిందో స్పష్టత లేకపోవడం వంటి అంశాలు పార్టీ వ్యవహార శైలిపై ప్రశ్నలను లేవనెత్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











