నిజామాబాద్ నగరం యొక్క పచ్చదనం కనుమరుగవుతుందనే ఆందోళనతో, బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. ఎండిపోతున్న డివైడర్ మొక్కలకు బిందెలతో నీరు పోసి, పచ్చదనం పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ నగరాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు ప్రధాన రహదారుల డివైడర్లపై విస్తృతంగా మొక్కలు నాటారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నేతృత్వంలో సుమారు 20 కిలోమీటర్ల మేర మొక్కలు నాటి, వాటి నిర్వహణకు డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నాల ఫలితంగానే నిజామాబాద్ నగరానికి 'ది బెస్ట్ గ్రీన్ సిటీ' అవార్డు లభించింది.
అయితే, ప్రస్తుతం నగరంలోని అనేక ప్రాంతాల్లో డివైడర్లపై ఉన్న మొక్కలు, చెట్లు సరైన సంరక్షణ లేక, నీటి కొరతతో ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలానికి ముందే మొక్కల సంరక్షణపై సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసినా తగిన చర్యలు తీసుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమని వారు విమర్శించారు.
ఈ నేపథ్యంలో, ఎండిపోతున్న మొక్కల పరిస్థితిని చూసి చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి బాజిరెడ్డి గోవర్ధన్, వీజీ గౌడ్ తదితరులు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి బిందెలలో నీరు తీసుకొచ్చి మొక్కలకు పోశారు. నగరంలోని పచ్చదనాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారు డిమాండ్ చేశారు.
సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, ఎండిపోతున్న మొక్కలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో దండు నీతు కిరణ్ శేఖర్, సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాశ్, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.












