మంచు పర్వతాలు, క్లిష్టమైన వాతావరణంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సిబ్బంది అందిస్తున్న సేవలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ లో వారి పోరాటాలు దేశానికి గర్వకారణమని అన్నారు. బీఎస్ఎఫ్ సిబ్బంది భద్రతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్ లోని బీఎస్ఎఫ్ క్యాంపస్ లో ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న ఇబ్బందులు, ఆపరేషన్ సింధూర్ లో వారి పాత్రపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సముద్ర మట్టానికి 15,500 అడుగుల ఎత్తులో, మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను, వారి ధైర్యసాహసాలను అధికారులు వీడియో ప్రజేంటేషన్ ద్వారా వివరించారు.
అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో, అనూహ్యమైన వాతావరణాన్ని తట్టుకుని విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ల అంకితభావాన్ని కేంద్ర మంత్రి కొనియాడారు. కనీస సౌకర్యాలు, వసతి లేకపోయినా సమర్ధవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. జవాన్ల భద్రత కేంద్ర ప్రభుత్వ కర్తవ్యమని, ఈ విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
అంతకుముందు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ ను సందర్శించారు. ఏటా నెల రోజులపాటు తెరిచి ఉండే ఈ గార్డెన్ లోని రంగురంగుల పూల తోటలను పరిశీలించారు. 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ తోటను ఒక్క నెలలోనే దాదాపు 8 నుండి 10 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారని అధికారులు తెలిపారు.
అనంతరం, భారీ భద్రత మధ్య కేంద్ర మంత్రి శ్రీనగర్ లోని దల్ లేక్ ను సందర్శించి, కాసేపు బోటులో ప్రయాణించారు.











