ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లుకు మద్దతు కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాశారు. మహిళల రాజకీయ సాధికారతకు ఉద్దేశించిన ఈ బిల్లు చారిత్రాత్మకమైనదని, దీనికి అన్ని పార్టీలు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస రావులకు లేఖలు పంపారు. ఈ లేఖల ద్వారా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లుకు మద్దతు కోరారు.
ఏప్రిల్ 16న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల రాజకీయ సాధికారతకు ఇది ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి మద్దతు తెలుపుతూ, చట్టసభల్లో మహిళలకు మూడో వంతు ప్రాతినిధ్యం కల్పించే దిశగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రభుత్వ వ్యవస్థల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి తన లేఖలో స్పష్టం చేశారు. విద్య, వైద్యం, పరిశోధనలు, సాంకేతికత, క్రీడలు, రక్షణ, వాణిజ్య రంగాల్లో మహిళలు చూపుతున్న ప్రతిభ దేశానికి గర్వకారణమని ఆయన ప్రస్తావించారు. ఈ బిల్లు మహిళా రిజర్వేషన్ అంశంపై దశాబ్దాలుగా జరుగుతున్న చర్చలకు ముగింపు పలుకుతుందని తెలిపారు.
2023లో ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలకడం ప్రజాస్వామ్య పరిపక్వతకు నిదర్శనమని చంద్రబాబు అభివర్ణించారు. 2029 ఎన్నికల నుంచే ఈ బిల్లు అమలులోకి రావాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనను సమిష్టిగా బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ చారిత్రాత్మక బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు తమ మద్దతును తెలియజేయడం ద్వారా మహిళా సాధికారతకు, దేశాభివృద్ధికి దోహదపడతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.











