హెచ్ఎండీఏలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వ ఆదేశాలను పాటించనందున ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం ఇటీవల షర్మిలను ఉట్నూరు ఆర్డీవోగా, ఆదిలాబాద్ జిల్లా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆమె కొత్త బాధ్యతల్లో చేరలేదు. దీంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) మ్యాపింగ్ పనులపై ప్రభావం పడినట్లు అధికారులు పేర్కొన్నారు.
షర్మిల ఉట్నూరుకు వెళ్లకుండా హెచ్ఎండీఏలోనే కొనసాగుతున్నారని సమాచారం. దూర ప్రాంతం కావడంతో అక్కడకు వెళ్లేందుకు ఆమె ఆసక్తి చూపలేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. హెచ్ఎండీఏ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా అక్కడే కొనసాగాలని ఆమె భావించినట్లు తెలిసింది.
ఆమెను తక్షణమే ఆదిలాబాద్ జిల్లాలో విధుల్లో చేరాలని పలుమార్లు ఆదేశించినప్పటికీ స్పందించకపోవడంతో, నిబంధనల ప్రకారం సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు షర్మిల సస్పెన్షన్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. సస్పెన్షన్ కాలంలో సీసీఎల్ఏ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లరాదని కూడా ఆదేశాలు జారీ చేశారు.











