ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్‌కు అత్యంత ప్రాధాన్యం పెరిగిందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు (AI) ద్వారా రూపొందుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో “వార్తలాప్ (VARTALAP)” పేరుతో జర్నలిస్టులకు ఒకరోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగ ఆధారిత హింస, మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జర్నలిజంలో కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన సుమారు 130 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నపాటి తప్పుదారి పట్టించే సమాచారం కూడా సమాజంలో భయం కలిగించడమే కాకుండా ప్రజల నమ్మకంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అన్నారు. మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని పేర్కొంటూ, ప్రభుత్వ పాలసీలు, పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని వివరించారు. నైతిక విలువలతో కూడిన నాణ్యమైన వార్తలను అందించాలని ఆమె సూచించారు.
పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారిక సమాచారాన్ని ప్రజలకు ఖచ్చితంగా చేర వేయడంలో పీఐబీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఏఐ విస్తరిస్తున్న ఈ కాలంలో తప్పుడు వార్తలను గుర్తించి ఖండించడంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తుందని చెప్పారు. లింగ సమానత్వం మరియు మహిళల సంక్షేమ పథకాలపై సీనియర్ జర్నలిస్టు సజయ కాకర్ల మాట్లాడుతూ.. లింగ సమానత్వం కుటుంబం నుంచే ప్రారంభం కావాలని, పిల్లల్లో సరైన దృక్పథాన్ని తల్లిదండ్రులు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.








