కామారెడ్డి జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో “విద్యా విజయోత్సవం” కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ మరియు క్రీడా రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులను సన్మానించారు.
ప్రతిభావంతులైన ప్రతి విద్యార్థికి రూ.10,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (ZP CEO) శ్రీ చందర్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి అభినందించారు.
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని శ్రీ చందర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ విజయోత్సవం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.










