ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం “విద్య విజయోత్సవం” దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యా, క్రీడా రంగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి, నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు.
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని అతిథులు ప్రశంసించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
SSCలో రాష్ట్ర 2వ ర్యాంక్ సాధించిన కుమ్మరి మౌనిక, 3వ ర్యాంక్ సాధించిన నాంపల్లి ధనలక్ష్మి, పెద్ద పట్నం ధరణి వంటి విద్యార్థులు ఈ సందర్భంగా సన్మానం అందుకున్నారు. ఇంటర్మీడియట్లో 1వ ర్యాంక్ సాధించిన ఎ. గాయత్రి, ఎమ్. అరవింద, 2వ ర్యాంక్ సాధించిన బి. నిఖిత కూడా పురస్కారాలు అందుకున్నారు. MPHW, MEC విభాగాల్లో కూడా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు.
క్రీడా రంగంలో కూడా సంగారెడ్డి జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. జాతీయ స్థాయి బాడ్మింటన్ క్రీడాకారిణి కె.రుత్విక రెడ్డి, వుషు క్రీడలో సీఎం కప్-2025 విజేత ఎమ్. స్మితిక, ఆత్యా పాత్యా జాతీయ స్థాయి క్రీడాకారిణి వి. ప్రియాంక గుర్తింపు పొందారు. వీరందరికీ రూ. 10,000 నగదు పురస్కారాలు అందజేశారు.
ఇంటర్మీడియట్ పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక రెమెడియల్ తరగతులు నిర్వహించి, వారిని ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దిన మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బందిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసినందుకు వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు.










