కామారెడ్డి, 2026-07-08
కామారెడ్డి జిల్లా, పాల్వంచ మండలం, ఫరీద్‌పేట్ గ్రామంలో రూ. 4,05,036/- ప్రజాధనాన్ని ఒకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసి దుర్వినియోగం చేశారని జిల్లా కలెక్టర్ విచారణలో తేలడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన్ను గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే నిర్బంధించారు.
కామారెడ్డి జిల్లా, పాల్వంచ మండలం, ఫరీద్‌పేట్ గ్రామంలో ఒకే పనికి రెండుసార్లు బిల్లులు డ్రా చేసి రూ. 4,05,036/- ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు జిల్లా కలెక్టర్ విచారణలో అధికారికంగా నిరూపితం కావడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సామాజిక కార్యకర్త గుర్జాల మధుసూదన్ రెడ్డి సమర్పించిన ఆధారాలతో సంయుక్త కమిటీ విచారణ జరిపి, కాంట్రాక్టర్ జీడిపల్లి లత నుండి నిధుల రికవరీకి, అధికారులపై షోకాజ్ నోటీసులకు కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఈ అవినీతి భాగోతంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫరీద్‌పేట్ గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు రమాదేవి, జ్యోతి, ప్రత్యూష, నర్సింహులు, వెంకట్ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అవినీతికి ప్రధాన సూత్రధారులైన సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, ఆయన భార్య అయిన కాంట్రాక్టర్ జీడిపల్లి లత దిష్టిబొమ్మను గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు దహనం చేశారు. అనంతరం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సర్పంచ్ తమకు వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు, వార్డు సభ్యులు.. సర్పంచ్ నరసింహారెడ్డిని గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే నిర్బంధించారు.
ఈ సందర్భంగా గ్రామ వార్డు సభ్యులు సర్పంచ్ నరసింహారెడ్డి అవినీతి చరిత్రను బట్టబయలు చేశారు. ప్రస్తుతం రికవరీ ఆర్డర్ వచ్చిన రూ. 4.05 లక్షల డబుల్ బిల్లింగ్ దందా అంతా నరసింహారెడ్డి గతంలో వైస్ ఎంపీపీగా, ఇన్చార్జ్ ఎంపీపీగా ఉన్నప్పుడు అక్రమంగా సాగించినదేనని వారు స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా, ఇటీవల ఆయన సర్పంచ్ పదవిలోకి వచ్చిన తర్వాత ఏకంగా రూ. 11 లక్షల నిధులను అక్రమంగా విత్‌డ్రా చేశారని వార్డు సభ్యులు ఆరోపించారు. ఈ రూ. 11 లక్షల కొత్త దందాపై కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం దీనిపై కూడా పక్కా ఆధారాలతో అధికారిక విచారణ వేగంగా సాగుతోందని వెల్లడించారు.
సర్పంచ్ నరసింహారెడ్డి చేసిన ఫోర్జరీ అక్రమాలను వార్డు సభ్యులు రమాదేవి, జ్యోతి, ప్రత్యూష, నర్సింహులు, వెంకట్ మీడియా ముందు కడిగిపారేశారు. సర్పంచ్ పదవి అధికారంతో ఒక ఎలక్ట్రికల్ షాప్ పేరు మీద డీజిల్ బిల్లులు, జేసీబీ బిల్లులు, శానిటేషన్ బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్మును ఎలా నొక్కేస్తావని వారు నిలదీశారు. ఎలక్ట్రికల్ షాప్‌కు, డీజిల్, జేసీబీ బిల్లులకు సంబంధం ఏంటని, ఈ దొంగ బిల్లుల వెనుక ఉన్న అసలు గుట్టంతా ఇప్పుడు జరుగుతున్న కలెక్టర్ విచారణలో త్వరలోనే బయటపడుతుందని వారు పేర్కొన్నారు.












