కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఈరోజు (బుధవారం) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ వ్యవహారంపై తీర్పును ధర్మాసనం ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెల్లుబాటుపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును హైకోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
కాళేశ్వరం అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్ 6ను జారీ చేస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. ఈ జీవోను సవాల్ చేస్తూ రాష్ట్రంలోని పలువురు కీలక నేతలు, అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.కె. జోషి తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, తమపై అభియోగాలు మోపే ముందు తమ వాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగుతోందని కోర్టుకు విన్నవించారు.
ప్రభుత్వం తరపు న్యాయవాదులు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను వెలికితీసేందుకే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కమిషన్ తన నివేదికను అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగానే సిద్ధం చేసిందని, విచారణలో భాగంగా పిటిషనర్లందరికీ నోటీసులు ఇచ్చి, నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నామని, కాబట్టి ఈ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు.







