తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటుచేసుకుని, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సభ్యులు ముట్టడించేందుకు యత్నించారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వారు ఆందోళనకు దిగారు.
జేఏసీ సభ్యులు తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో కొందరు ఉద్యమకారులు కిందపడిపోయారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను అక్కడికి తరలించారు. పోలీసుల తీరుపై ఉద్యమకారుల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదని, వారి సమస్యలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆందోళనకారులు విమర్శించారు.
ఉద్యమకారుల ఆందోళనతో తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. భవన్ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.











