తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఇంజినీర్లు, నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Col. పరిచిత్ మెహ్రా నేతృత్వంలో ఏర్పడిన ఈ సమన్వయ కమిటీ, బ్యారేజీల మరమ్మతు పనులను పర్యవేక్షించనుంది. ప్రాజెక్ట్ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటమే దీని ప్రధాన లక్ష్యం.
వర్షాకాలం ప్రారంభానికి ముందే జియో టెక్నికల్ పరిశీలనలు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. మే 30 లోగా ఈ పనులు పూర్తి చేయాలని, రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించింది.
సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) అనుమతులు, డిజైనింగ్ పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోజువారీ కార్యాచరణ ప్రణాళికతో పనులు చేపట్టాలని సూచించింది.











