తమ సమస్యల పరిష్కారం కోరుతూ సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘాల నాయకులు అదనపు కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల ఐక్య వేదిక కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు పెద్ద ఎత్తున గుమిగూడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా TNGOs అధ్యక్షుడు ఎమ్.డి. జావీద్ అలీ, జనరల్ సెక్రటరీ డాక్టర్ డి. వైద్యనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన అనంతరం, ఉద్యోగుల సమస్యలపై వినతి పత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్లు ఆర్.డి. మాధురి, ఆర్.పాండులకు అందజేశారు. PRC అమలులో జాప్యం, పెండింగ్ బిల్లులు, GPF, పెన్షనర్ల బకాయిలు, CPS రద్దు, ఆరోగ్య భద్రత కార్డుల జారీలో ఆలస్యం వంటి అంశాలపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జావీద్ అలీ, ప్రభుత్వం వెంటనే ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాలు మరింత తీవ్రతరం అవుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో TGEJAC చైర్మన్ ఎమ్.డి. జావీద్ అలీ, సెక్రటరీ డాక్టర్ డి. వైద్యనాథ్, TNGOs మహిళ ఉపాధ్యక్షురాలు నిర్మల రాజకుమారి, జిల్లా కార్యదర్శి రవి, కోశాధికారి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, శ్రీకాంత్తో పాటు పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.








