నిజామాబాద్, జూలై 21
బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు దక్కాయని, నిరుద్యోగులను మోసం చేసిన కేటీఆర్‌కు ఉద్యోగాల అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగాల పేరుతో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబానికే ఉద్యోగాలు దక్కాయని, నిరుద్యోగులను మోసం చేసిన కేటీఆర్‌కు ఉద్యోగాల అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ విమర్శించారు. ఉద్యోగాల పేరుతో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని అన్నారు.
ఇరిగేషన్ శాఖలో జరిగిన అవకతవకలకు అప్పట్లో కీలక బాధ్యత వహించిన హరీశ్‌రావు ఇప్పుడు కరువు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, కమిషన్ల కోసమే నిర్ణయాలు తీసుకున్నారని, వాటి ఫలితంగానే ప్రాజెక్టు దెబ్బతిన్నదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం ఇక సాధ్యం కాదని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని చెప్పారు.
పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.20 వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రతి నియోజకవర్గానికి మూడు వేలకుపైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు.
మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులు త్వరలో అందనున్నాయని, దీంతో పనులు వేగవంతమై త్వరలోనే పూర్తవుతాయని వెల్లడించారు. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలు వాస్తవాలకు విరుద్ధమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ జిల్లా అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కవితా రెడ్డి, కౌడపు శరత్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.











