సంగారెడ్డి, జూలై 21
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్‌ను నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిని దిగ్బంధించాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు మేరకు జరిగిన ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది.
ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్ట్‌కు నిరసనగా సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వారి అరెస్ట్‌ను నిరసిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు సంగారెడ్డి వద్ద హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిని దిగ్బంధించాయి.
జగ్గారెడ్డి పిలుపుతో వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు భారీగా తరలివచ్చారు. జగ్గారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలంతా ఒకేసారి జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.
సుమారు గంట పాటు ఈ రాస్తారోకో కొనసాగడంతో హైదరాబాద్-ముంబై హైవేపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జగ్గారెడ్డి ధర్నాకు దిగుతారనే ముందస్తు సమాచారంతో పోలీసులు పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద భారీగా మోహరించారు.
రాస్తారోకోతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో, పోలీసులు జగ్గారెడ్డిని బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. జగ్గారెడ్డిని తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని కార్యకర్తలు చుట్టుముట్టి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు తీవ్ర ఇబ్బందుల నడుమ, అతికష్టం మీద వాహనాన్ని అక్కడి నుండి ముందుకు కదిలించి ఆయన్ను తరలించారు.











