కామారెడ్డి, 13-07-2026
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అర్హులైన ప్రతి చిన్నారికి అల్బెండాజోల్ మాత్ర చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం (National Deworming Day) సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ప్రతి అర్హత కలిగిన చిన్నారికి చేరేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
సోమవారం కామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా అల్బెండాజోల్ మాత్రలు అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఒకటి నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, కిశోరులకు సంవత్సరానికి రెండుసార్లు అల్బెండాజోల్ మాత్ర ఇవ్వడం ద్వారా నులిపురుగుల సమస్యను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. నులిపురుగుల కారణంగా పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక ఎదుగుదల మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జిల్లాలో అర్హులైన 2,46,177 మంది ప్రతి చిన్నారులకు, ప్రతి విద్యార్థికి నులిపురుగుల నివారణ మాత్ర అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు తప్పనిసరిగా మాత్ర వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు.
జూలై 20న నిర్వహించే మాప్-అప్ డే సందర్భంగా మొదటి విడతలో మాత్రలు తీసుకోలేకపోయిన పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు అందచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. జె.వెంకటి, ప్రోగామ్ అధికారి డాక్టర్.రోహిత్ కుమార్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, మున్సిపాలిటీ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, స్థానిక కౌన్సిలర్ అఖిల, జిల్లా విద్యాశాఖాధికారి మల్లికార్జున్, స్థానిక వైద్యాధికారి డాక్టర్ చందన ప్రియ, ఎంఈఓ ఎల్లయ్య, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు వై. మాధవి, వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












