తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రారంభించనున్న నేపథ్యంలో, ఆ పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను జాగృతి మహిళా నాయకులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈనెల 25న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి, మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాట్లను తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మీ నేతృత్వంలోని బృందం సమీక్షించింది.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న కార్యకర్తలు, వాహనాల రాకపోకలు, మహిళా అతిథుల కోసం ప్రత్యేక సౌకర్యాలు వంటి అంశాలపై నిర్వాహకులతో నాయకులు చర్చించారు.
సమర్థవంతమైన నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర లాజిస్టిక్స్ పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమీక్షలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని, ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని నాయకులు నిర్వాహకులకు సూచించారు.







