కామారెడ్డి, 10.07.2026
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ ఆదేశించారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్యానికి కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజ్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుండి కార్యదర్శి నవీన్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్య బలోపేతానికి కీలకమని అన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మిగిలిన ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, ఈ నెల 24వ తేదీ నాటికి డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ నిర్ణీత కాల వ్యవధిలో ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, దేశవ్యాప్తంగా గతంలో కూడా పలుమార్లు ప్రత్యేక సవరణ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క అర్హులైన పౌరుడు ఓటు హక్కు కోల్పోకుండా, అనర్హులు జాబితాలోకి చేరకుండా జిల్లా ఎన్నికల అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారం అందజేసిన ఓటర్లందరినీ ముసాయిదా జాబితాలో చేర్చడం జరుగుతుందని, విచారణ లేకుండా ఏ ఓటరు పేరును జాబితా నుండి తొలగించకూడదని తెలిపారు. దరఖాస్తుదారులకు తగిన విచారణ ద్వారా వారి అర్హతను ధృవీకరించిన అనంతరం తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, తుది జాబితా ప్రచురణ తర్వాత ఎవరైనా అసంతృప్తిగా ఉంటే జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ సవరణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపట్టడం జరుగుతుందని, ఏ పోలింగ్ కేంద్రంలోనూ 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ 99.6 శాతం, డిజిటైజేషన్ ప్రక్రియ 21.94 శాతం పూర్తయ్యాయని, మిగిలిన ఫారాలు ఈరోజు పంపిణీ పూర్తి చేసి డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం జరుగుతుందని తెలిపారు.












